
అందాన్ని పొగడడం అంటే కొన్ని పాటలలోలాగా కొలతలు చెప్పకుండా, తిట్టకుండా, రోడ్డు మీద పోయే అమ్మాయిని ఒక పోకిరి అల్లరి చేసినట్టుగా కాకుండా, తను మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీని, ఆరాధనాభావంతో మెచ్చుకోవడం లేదా కీర్తించడంలా ఉంటుంది ఈ పాట. కేవలం బాహ్య అందాలనే కాకుండా, వివిధ సందర్భాలలో ఆమెలో కలిగిన భావోద్వేగాలు, ఆ సమయాలలో బహిర్గతమైన స్త్రీ సహజ హావభావ సౌందర్యాన్ని స్వర్గీయ వేటూరి సుందర రామ్మూర్తి అద్భుతంగా ఆవిష్కరించగా, కీరవాణి స్వరకల్పనలో, 'సొగసు చూడ తరం కాదేమో గానీ, ఇంత సొగసుగా పాడడం నా ఒక్కడి తరమే' అన్నట్టుగా బాలు పాడారు. ఇక బాపు గురించి వేరే చెప్పాలా! ఆమని అంత అందంగా మరే సినిమాలోనూ కనబడలేదు. అంతేకాదు ఆ సినిమా చూసిన ప్రతి మొగుడికీ 'అరరే... ఇన్నాళ్ళూ నా భార్యలోనూ దాగున్న ఈ అందాన్ని నేనెందుకు గమనించలేక పోయానబ్బా?' అని అనిపించి ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో.
ఇలాంటి పాటనే నేటితరం అమ్మాయి విషయంలో పాడవలసి వస్తే, ఆ పాట ఎలా ఉంటుందన్న ఆలోచనతో సరదాగా ఇది రాశాను. చదివి (అదే శైలిలో పాడుకుని) చూడండి. ఈ పాటకు కరాకే ట్రాక్ కూడా అంతర్జాలంలో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ పదాలతో పాడుకుని మీ వద్ద సంక్షిప్తం చేసుకోండి.
పల్లవి:
అతను: సొగసు చూడ తరమా
ఆమె: ఆ ఆహా ...
అతను: సొగసు చూడ తరమా
ఆమె : అ ఆ ...
అతను: నీ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
అనుపల్లవి:
అతను: ఆ సోగ కన్నుల్లు, అవి పంపే పిలుపుల్లు
ఆ మూతి విరుపుల్లు, అవి తెలిపే అలకల్లు
అందమే సుమా !
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
చరణం 1:
అతను: జీన్స్ ప్యాంటు వేసుకుని
హై హీల్స్ తో నడిచేవేళ
లతలాగా ఊగే తనువును
తనివి తీరగ చూస్తుంటే
చురుకుమన్న చూపు సెగకు
అడుగులు తడబడి, చూపులు ముడివడి
సిగ్గుతోన చెమర్చిన చెక్కిలి కెంపుల
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
చరణం 2:
అతను: చూసిచూడనట్టి చూపుల్తో ఎదను గుచ్చి
ఉత్తుత్తి కోపాల విసురులతో ఫోజుకొట్టి
ఇరకాటపు మాటలతో ఎటుతేల్చక నన్ను చంపి
మనసునొచ్చి నేనుంటే కవ్వింపుగ నవ్వినపుడు
పకపకమని నవ్వినపుడు
ఆమె: హహహ్హ!
అతను: ఆ సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా
చరణం 3:
అతను: లైవ్ చాట్ కు నను పిలచి ఊసులాడుతున్నపుడు
ఆమె: ఊ ఊ ఊ ...
అతను: చిరుకోరిక బైటపెట్టి, 'ఓకేనా' అన్నపుడు
తీపితిట్టు తిట్టి, సిస్టమాపుచేసి
సెల్ఫోనులో, ఇంగ్లీషులో
యమపీకుడు పీకినపుడు
ఆమె: యూ...!!!
అతను: ఆ ఉడుకు చూడతరమా
నీ దుడుకునాపతరమా
చరణం 4:
అతను: పగలంతా ఆఫీసులో పరుగులు తీసి, అలసిసొలసి ఇంటికిచేరి
పొడుగుగౌనుతో వంటింట్లో వండీ వార్చి, అలుపే తీరగ తానాలాడి
శ్రీదేవియై శ్రీవారికై ఎదురుచూచు విరహాలలో
నీ అలసిన కనుల, ఆ చెదరిన ముంగురుల
కళను పొగడతరమా
నీ సొగసునోప తరమా
వెచ్చని పరువాలు పూసుకున్న పరిమళాలు
ఎర్రని పెదవి రంగు అదిరేటి ముక్కు సిరలు
అందమే సుమా !
సొగసు చూడ తరమా
నీ సొగసు చూడ తరమా