19, ఫిబ్రవరి 2013, మంగళవారం

సొగసు చూడ తరమా...

పద్మశ్రీ  బాపు రూపుదిద్దిన దృశ్యకావ్యం 'మిస్టర్ పెళ్ళాం' సినిమా. అందులో కథానాయికగా నటి ఆమని చాలా సొగసుగా నటించింది. సినిమాలో నాయిక అందాలను పొగడుతూ ఒక పాట ఉంది.

అందాన్ని పొగడడం అంటే కొన్ని పాటలలోలాగా కొలతలు చెప్పకుండా, తిట్టకుండా, రోడ్డు మీద పోయే అమ్మాయిని ఒక పోకిరి అల్లరి చేసినట్టుగా కాకుండా, తను మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీని, ఆరాధనాభావంతో మెచ్చుకోవడం లేదా కీర్తించడంలా ఉంటుంది ఈ పాట. కేవలం బాహ్య అందాలనే కాకుండా, వివిధ సందర్భాలలో  ఆమెలో కలిగిన భావోద్వేగాలు, ఆ సమయాలలో బహిర్గతమైన స్త్రీ సహజ హావభావ సౌందర్యాన్ని స్వర్గీయ వేటూరి సుందర రామ్మూర్తి అద్భుతంగా ఆవిష్కరించగా, కీరవాణి స్వరకల్పనలో, 'సొగసు చూడ తరం కాదేమో గానీ, ఇంత సొగసుగా  పాడడం నా ఒక్కడి తరమే' అన్నట్టుగా బాలు పాడారు. ఇక బాపు గురించి వేరే చెప్పాలా! ఆమని అంత అందంగా మరే సినిమాలోనూ కనబడలేదు. అంతేకాదు ఆ సినిమా చూసిన ప్రతి మొగుడికీ 'అరరే... ఇన్నాళ్ళూ నా భార్యలోనూ దాగున్న ఈ అందాన్ని నేనెందుకు గమనించలేక పోయానబ్బా?' అని అనిపించి ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో.

ఇలాంటి పాటనే నేటితరం అమ్మాయి విషయంలో పాడవలసి వస్తే, ఆ పాట ఎలా ఉంటుందన్న ఆలోచనతో సరదాగా ఇది రాశాను.  చదివి (అదే శైలిలో పాడుకుని) చూడండి. ఈ పాటకు కరాకే ట్రాక్ కూడా అంతర్జాలంలో అందుబాటులో ఉంది. కాబట్టి ఈ పదాలతో పాడుకుని మీ వద్ద సంక్షిప్తం చేసుకోండి. 

పల్లవి:

అతను:  సొగసు చూడ తరమా
ఆమె:     ఆ ఆహా ...
అతను:  సొగసు చూడ తరమా
ఆమె :    అ ఆ ...
అతను:  నీ సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

అనుపల్లవి:

అతను:  ఆ సోగ కన్నుల్లు, అవి పంపే పిలుపుల్లు
              ఆ మూతి విరుపుల్లు, అవి తెలిపే అలకల్లు
              అందమే సుమా !
              సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

చరణం 1:

అతను:  జీన్స్ ప్యాంటు వేసుకుని
              హై హీల్స్ తో నడిచేవేళ
              లతలాగా ఊగే తనువును
              తనివి తీరగ చూస్తుంటే

              చురుకుమన్న చూపు సెగకు
              అడుగులు తడబడి, చూపులు ముడివడి
              సిగ్గుతోన చెమర్చిన చెక్కిలి కెంపుల
              సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

చరణం 2:

అతను:  చూసిచూడనట్టి చూపుల్తో ఎదను గుచ్చి
              ఉత్తుత్తి కోపాల విసురులతో ఫోజుకొట్టి
              ఇరకాటపు మాటలతో ఎటుతేల్చక నన్ను చంపి
              మనసునొచ్చి నేనుంటే కవ్వింపుగ నవ్వినపుడు
              పకపకమని నవ్వినపుడు
ఆమె:     హహహ్హ!
అతను:  ఆ  సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా

చరణం 3:

అతను:  లైవ్ చాట్ కు నను పిలచి ఊసులాడుతున్నపుడు
ఆమె:     ఊ ఊ ఊ ...
అతను:  చిరుకోరిక బైటపెట్టి,   'ఓకేనా' అన్నపుడు
              తీపితిట్టు తిట్టి, సిస్టమాపుచేసి
              సెల్ఫోనులో, ఇంగ్లీషులో
              యమపీకుడు పీకినపుడు
ఆమె:     యూ...!!!
అతను:  ఆ ఉడుకు చూడతరమా
              నీ దుడుకునాపతరమా

చరణం 4:


అతను:  పగలంతా ఆఫీసులో పరుగులు తీసి, అలసిసొలసి  ఇంటికిచేరి
              పొడుగుగౌనుతో  వంటింట్లో వండీ వార్చి, అలుపే తీరగ తానాలాడి
              శ్రీదేవియై శ్రీవారికై ఎదురుచూచు విరహాలలో
              నీ అలసిన కనుల, ఆ చెదరిన ముంగురుల
              కళను పొగడతరమా
              నీ సొగసునోప తరమా


              వెచ్చని పరువాలు పూసుకున్న పరిమళాలు
              ఎర్రని పెదవి రంగు అదిరేటి ముక్కు సిరలు

              అందమే సుమా !
              సొగసు చూడ తరమా
              నీ సొగసు చూడ తరమా




                     


1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

స్త్రీ కోరిక (తప్పక చదవాల్సిన కథ - ముగింపు)


(నిన్నటి బ్లాగులో ...జరిగిన కథ )

యువరాజు ప్రాణాలను కాపాడేందుకు ఒక ముదుసలి మంత్రగత్తెను వివాహం చేసుకునేందుకు సిద్ధపడతాడు యువరాజు స్నేహితుడు. అప్పుడు యువరాజు ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి అతనికి మరణశిక్షను తప్పిస్తుంది మంత్రగత్తె.

ప్రశ్న: స్త్రీ నిజంగా కోరుకునేది ?
జవాబు: తనకు సంబంధించిన ఏ విషయమైనా తన చేతుల్లోనే ఉండాలనే ప్రతి స్త్రీ కోరుకుంటుంది.

ఇచ్చినమాట ప్రకారం మంత్రగత్తెను  పెళ్ళిచేసుకున్నాడు స్నేహితుడు.

మొదటిరాత్రి...
తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తోన్న ఓ భయంకర అనుభవాన్ని తలచుకుని యువరాజు లోలోన కుమిలిపోతుండగా , స్నేహితుడు మాత్రం చిరునవ్వుతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాడు.

ఆశ్చర్యం!
అక్కడ పడక మీద ఓ అద్భుత సౌందర్యరాశి అతనికి స్వాగతం పలికింది. ఏమిటిదని అడిగాడు.
'నీ స్నేహితుడైన యువరాజు ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం... నీ భార్యగా నాకు సగం దక్కింది. అందుకే నాకీ రూపం ప్రాప్తించింది. అయితే ఈ అందం రోజులో సగకాలం మాత్రమే ఉంటుంది. మిగిలిన అర్థకాలం నేను నా అసలు రూపంతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనెప్పుడు ఏ రూపంతో ఉండాలి?

పగలు అందగత్తెగా  కనిపిస్తే... 
గొప్ప అందగత్తెకు భర్తగా నీకు గౌరవం ఉంటుంది. కానీ రాత్రి వేళ ఒక కురూపితో కాపురం చేయాల్సి ఉంటుంది. 
రాత్రిళ్ళు అందగత్తెగా కనిపిస్తే ...
ప్రతి రాత్రీ స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. కానీ పగటిపూట ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే కురూపిని చూసి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు.నిర్ణయం నీది. నీకు ఎలా కావాలో చెప్పు.' అంది మంత్రగత్తె.

(ముగింపు... )

'ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. నా భార్యగా నీకు కూడా సంబంధించినది. ఏ స్త్రీ అయినా తనకు సంబంధించిన విషయాలపై తనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటుందని నువ్వే చెప్పావు. అలాంటి సహజసిద్ధమైన స్త్రీ కోరికను నీ విషయంలో నేను తీర్చాలనుకుంటున్నాను. భర్తగా అది నా బాధ్యత కూడా. కాబట్టి ఈ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకో. దానికి నేను మనస్పూర్తిగా కట్టుబడి ఉంటాను.' ఏమాత్రం తడబడకుండా  అన్నాడు.

మంత్రగత్తె మనసు ఉప్పొంగిపోయింది. 'నీ స్నేహితుడి ప్రాణాలను కాపాడడం కోసం నా లాంటి కురూపిని  పెళ్లి చేసుకోడానికి సిద్ధపడితే, అది కేవలం త్యాగమే కదా అనుకున్నాను. పెళ్లి అయిన తర్వాత నన్ను భార్యగా గౌరవిస్తావో లేదో అన్న సందేహం కలిగింది. అందుకే ఈ విధమైన ప్రశ్న నీ ముందుంచాను. భార్య రూపంతో నిమిత్తం  లేకుండా ఆమెను స్త్రీగా గౌరవించే నీ లాంటి భర్తను పొందాక నాకీ మంత్రశక్తులతో పనేముంది? నా జీవితమంతా తపించింది నీలాంటి భర్తకోసమే. అందుకే నేను అన్ని వేళల్లోనూ సౌందర్యవతి గానే, యవ్వనంతో ఉండేందుకు  నా శక్తులన్నీ ధారపోస్తున్నాను.' అన్నదామె.

(కథ సమాప్తం.)

ఈ కథ చెప్పొచ్చేదేంటంటే ...

పై రూపంతో సంబంధం లేకుండా ప్రతి స్త్రీ మనసూ మంత్రగత్తె మనసును పోలివుంటుంది. భర్త నుంచే కాదు, సమాజం నుంచి కూడా ఆమె ఆశించేది ఒక్కటే . తన జీవితం తన చేతుల్లో ఉండాలి. ఆ స్వేచ్ఛను ఆమెకు ఇవ్వనప్పుడే పరిస్థితులు వికృతంగా మారతాయి.




31, జనవరి 2013, గురువారం

స్త్రీ కోరిక...? (తప్పక చదవాల్సిన కథ )

'ఆడది కోరుకునే వరాలు రెండే రెండు ... పచ్చని సంసారం , చక్కని సంతానం...' 
అంటూ ఆవిడ కోరికలకు హద్దులు గీసారొక సినీకవి. ఇందులో ఆయన తప్పేమీలేదు. ఎందుకంటే ఆదినుంచీ 'కార్యేషు దాసీ ...' అంటూ మొదలెట్టి నువ్విలాగే ఉండాలి, నువ్వు చేయాల్సిన పనులివే, నీకు కావలసినవి ఇవే అంటూ ... స్త్రీ మనసుకు అడ్డుగోడలు కట్టారు. దాంతో ఆమె కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నాకు కావాల్సింది ఇంతే అనుకుంటూ బ్రతకసాగింది. ఇప్పటికీ దాదాపు అలాగే బతుకీడుస్తోంది. అందుకే పై పాటల్లాంటివి పుట్టుకొచ్చాయి.

'గాలికదుపు లేదు, కడలికంతు లేదు, గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా ? ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా?...' 
అంటూ తొలి రోజుల్లో స్వేచ్ఛను కోరుకున్న అమ్మాయిలు సైతం, ఆ తర్వాత భర్త కనుసైగల్లొ ఒదిగిపోక తప్పని పరిస్థితులు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉన్నాయి, ఉంటాయి. కానీ స్త్రీ నిజంగా ఏం కోరుకుంటుంది అనేది ఈ కథ స్పష్టంగా చెప్తుంది. అందుకే స్త్రీ, పురుషులు ఇద్దరూ తప్పనిసరిగా ఈ ఆసక్తికరమైన కథను చదవాలి, చదివించాలి అని నాకనిపించింది. ఇ - మెయిల్ ద్వారా ఓ ఫ్రెండ్ ఆంగ్లంలో పంపిన ఈ కథను నా బ్లాగులో ఉంచాలనిపించి తెలుగులో అనువాదం చేస్తున్నాను.

కథ :
అనగనగా ఒక యువరాజు. శత్రుదేశపు రాజు చేసిన దండయాత్రలో రాజ్యాన్ని పోగొట్టుకుని, అతని చేతికి బందీగా చిక్కాడు. అలా తన చేతికి చిక్కిన యువరాజును శత్రుశేషం లేకుండా చంపేద్దామనే అనుకున్నాడు శత్రురాజు. కానీ ఆ యువరాజుకు అశేష అభిమానులు ఉన్నారు. అప్పటికే  ప్రజల్లో తిరుగుబాటు సంకేతాలు కనబడుతున్నాయి. అందుకని ఒక షరతు పెట్టాడు శత్రురాజు.

షరతు ప్రకారం రాజు అడిగే ఒక క్లిష్టమైన ప్రశ్నకు యువరాజు సమాధానం చెప్పాలి. వెంటనే చెప్పక్కరలేదందోయ్. కఠినమైన ప్రశ్న కాబట్టి, ఒక సంవత్సరం గడువు కూడా ఇచ్చాడు. పైగా మరో వెసులుబాటు కూడా ఉంది. ఫోన్ ఎ ఫ్రెండ్ లాంటి అవకాశమే.  కాకపోతే అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి  రాజ్యమంతా కలియతిరుగుతూ ఆప్తులను, మేధావులను, పండితులను, అనుభవజ్ఞులను ఎవరినైనా సంప్రదించి సలహా తీసుకోవచ్చు. సంవత్సరం తర్వాత ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే యువరాజుకు ప్రాణాలతో పాటు, స్వేచ్ఛ కూడా లభిస్తుంది. చెప్పలేకపోతే మరణదండన తప్పదు. ఈ షరతుకు యువరాజుతో పాటు, ప్రజలందరూ అంగీకరిస్తారు. అప్పుడు శత్రురాజు ప్రశ్నేంటో చెప్పాడు.

ప్రశ్న: స్త్రీ నిజంగా కోరుకునేదేంటి?   

మొదట ఓసింతేనా అనిపించిన ప్రశ్న కాస్తా, ఆలోచించేకొద్దీ  జటిలమనిపించింది. 'అవును! కష్టమైన ప్రశ్నే' అన్నారు మేథావులు. 'ఊహకు అందడం కష్టం' అన్నారు కవులు. ఇంక లాభం లేదని యువరాజు ఊరు మీద పడ్డాడు. ఏకంగా ఆడవాళ్ళనే అడిగి చూసాడు. చర్చాగోష్టులు నిర్వహించాడు. అయినా సరైన సమాధానం దొరకలేదు. మరోవైపు సమయం మించి పోతోంది. చివరికి ఎవరో పెద్దమనిషి సలహా ఇచ్చాడు. ఆ రాజ్యంలో జనావాసాలకు దూరంగా నివసించే మంత్రగత్తె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలదు అన్నాడు. ఆమె గురించి తెలిసిన వాళ్ళంతా ఔను నిజమే అంటూ అతనితో ఏకీభవించారు. యువరాజు కూడా ఆమె గురించి గతంలో విన్నాడు. అయితే  ఆమెతో లావాదేవీలు చాలా కష్టం. భారీ ప్రతిఫలాన్ని కోరుతుంది. అసలే రాజ్యం పోగొట్టుకుని ఉన్న తాను ఆమె కోరినంత ఇవ్వడం అయ్యేపని కాదు. అందుకని ఆ ప్రయత్నాన్ని చేయలేదతను.

ఇక ఆఖరు రోజు రానే వచ్చింది. మరణదండన తప్పేట్టులేదు.  ఏం చేయడమా అని ఆలోచిస్తుంటే అతని ప్రాణ స్నేహితుడు వచ్చాడు. అతను గతంలో యువరాజు సైన్యంలో ఒక ముఖ్యుడుగా ఉండేవాడు. అందగాడు, ధీరుడు. వీరుడు, నవయవ్వనుడు.
'ఉన్న ఒకే ఒక అవకాశం మంత్రగత్తెను కలవడం. అసలామెను కలిస్తేనే కదా ఆమె అడిగే ప్రతిఫలం గురించి తెలిసేది. అంతగా ఆమె అడిగింది మనం ఇవ్వలేనప్పుడు చూద్దాం. ముందు వెళ్దాం పద!' అన్నాడు.
ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళారు. ప్రశ్న విన్న ఆమె సమాధానం చెప్పడానికి అంగీకరించింది. అయితే ప్రతిఫలంగా డబ్బుకు బదులు మరొకటి అడిగింది. అదేమిటంటే యువరాజుతో పాటుగా వచ్చిన  స్నేహితుడు ఆమెను పెళ్ళి  చేసుకోవాలి.
ఉలిక్కిపడ్డాడు యువరాజు. పళ్ళన్నీ రాలిపోయిన పండు ముసలిది. చూస్తేనే అసహ్యం వేసే కురూపి. దానికి తోడు మాటకు మాటకు మధ్య ఏదో జబ్బువల్ల నోటినుంచి వస్తున్న జుగుప్సాకరమైన శబ్దాలు.  శరీరం నుంచి భరింప లేనంతగా దుర్వాసన. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోమని ఎలా అనగలడు? తన ప్రాణం కోసం స్నేహితుడి జీవితాన్ని నరకంలోకి తోయాలా? 
'కుదరదు' అంటూ  వెనుతిరిగాడు యువరాజు. స్నేహితుడు ఆపాడు.
'నీ ప్రాణం కంటే నాకేదీ ఎక్కువ కాదు. నీకు సాయం చేయగల అవకాశం వచ్చాక కూడా, దాన్ని వదులుకుంటే, నా స్వార్థం నేను చూసుకుంటే, స్నేహానికి విలువేంటి?' అన్నాడు.  
'అలాగని ఆమె షరతును అంగీకరించడం నా స్వార్థం చూసుకున్నట్టు అవుతుంది.'
పట్టుపట్టాడు స్నేహితుడు.
'అలాగైతే ఒక షరతు. నీ జవాబు సరైనది అయి నాకు మరణశిక్ష తప్పిన తర్వాతే మీ పెళ్లి.' అన్నాడు యువరాజు.
మంత్రగత్తె అందుకు అంగీకరించి సమాధానం చెప్పింది.

జవాబు : ఏ స్త్రీ అయినా నిజంగా కోరుకునేది ఒక్కటే. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తన చేతుల్లోనే ఉండాలి. 

అదే సమాధానాన్ని శత్రురాజుకు చెప్పాడు యువరాజు. మరణదండన తప్పింది. యువరాజుకు స్వేచ్ఛ లభించింది. అంతేకాదు వారి స్నేహానికి ముచ్చటపడిన శత్రురాజు, రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేసాడు. మంత్రగత్తెకు ఇచ్చిన మాట ప్రకారం వారిద్దరికీ ఘనంగా వివాహం జరిపించాడు యువరాజు.

మొదటిరాత్రి...
తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తోన్న ఓ భయంకర అనుభవాన్ని తలచుకుని యువరాజు లోలోన కుమిలిపోతుండగా , స్నేహితుడు మాత్రం చిరునవ్వుతో శోభనపు గదిలోకి అడుగుపెట్టాడు.
ఆశ్చర్యం!
అక్కడ పడక మీద ఓ అద్భుత సౌందర్యరాశి అతనికి స్వాగతం పలికింది. ఏమిటిదని అడిగాడు.
'నీ స్నేహితుడైన యువరాజు ప్రాణాలను కాపాడడం కోసం నువ్వు చేసిన త్యాగానికి ప్రతిఫలం... నీ భార్యగా నాకు సగం దక్కింది. అందుకే నాకీ రూపం ప్రాప్తించింది. అయితే ఈ అందం రోజులో సగకాలం మాత్రమే ఉంటుంది. మిగిలిన అర్థకాలం నేను నా అసలు రూపంతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనెప్పుడు ఏ రూపంతో ఉండాలి.
పగలు అందగత్తెగా  కనిపిస్తే... 
గొప్ప అందగత్తెకు భర్తగా నీకు గౌరవం ఉంటుంది. కానీ రాత్రి వేళ ఒక కురూపితో కాపురం చేయాల్సి ఉంటుంది. 
రాత్రిళ్ళు అందగత్తెగా కనిపిస్తే ...
ప్రతి రాత్రీ స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. కానీ పగటిపూట ఎక్కడికి వెళ్ళినా నీ వెంట ఉండే కురూపిని చూసి అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు.నిర్ణయం నీది. నీకు ఎలా కావాలో చెప్పు.' అంది మంత్రగత్తె.

(మంత్రగత్తె తన ముందుంచిన రెండు అవకాశాలలో అతడు ఏం కోరుకున్నాడో తర్వాతి బ్లాగులో చెప్తాను.)

ఇది చదివిన మగవారికి ఓ ప్రశ్న...
అతని స్థానంలో మీరుంటే ఏం  కోరుకుంటారు?

ఆడవారికి...
స్త్రీ కోరిక విషయంలో మంత్రగత్తె చెప్పింది ఎంతవరకు నిజం?
మీరైతే ఏం సమాధానం చెప్ప్తారు?

మీ సమాదానాలని రాయండి. బయటపడడం ఎందుకనుకుంటే, జవాబును మనసులో అట్టేపెట్టుకుని తర్వాతి బ్లాగులో ఇచ్చే జవాబుతో (స్నేహితుడు చెప్పినదాంతో) పోల్చిచూసుకోండి. ఈ కథను ఇదివరకే విన్నవాళ్ళు కూడా మీ స్పందనను, కథా వివరాలను తెలపవచ్చు.